Pages

మానసబోధ 26 - 35

మానసబోధ 26 - 35
26. కామాది రూపులగు 
     శత్రువుల జాడను 
     కనిపెట్టుచుండుమూ మనసా
             ధైర్యమును చేబట్టి
           వానితో పోరాడి
          విజయాన్ని పొందుమూ మనసా

27. పంచభూతాలతో
      నిర్మితంబై నట్టి
     తోలుబొమ్మవు కావు మనసా
         దేశకాలాలచే
        గ్రసితంబు కానట్టి
      చిద్రూపమే మనసా

28. సచ్చిదానందమగు
     బ్రహ్మమే నే ననుచు
    భావించుచుండుమూ మనసా
         నిరతంబు గావించు
        మననంబుచే నీవు
        తద్రూప మగుదువూ మనసా

29. దీప మున్నప్పుడె
     ఇళ్ళు వాకిళ్ళను
     చక్కబెట్టుకో ఓయి మనసా
         ఆరోగ్య మున్నప్పుడె
        భుక్తికై యున్నపుడె
        దైవాన్ని తెలిసికో మనసా

30. కాలచక్రము నందు
     గిరగిరా తిరుగుచు
    క్లేశ మొందగనేల మనసా
        జన్మమే లేనట్టి
      ఆత్మపదమును పొంది
    ఆనంద మొందుమూ మనసా

31. విశ్వమం దెల్లెడల
      గొప్ప శాసన మొకటి
     పనిచేయుచున్నదీ మనసా
        పుణ్యంబుచే సుఖము
       పాపంబుచే బాధ
        కలిగితీరును దాన మనసా

32. దేహావసానమున
       దంధ్వాదులందరు
     వీడిపోదురు ఓయి మనసా
       తాను చేసిన కర్మ
       ఒక్కటే తన వెంట
      ఎల్లచోట్లకు వచ్చు మనసా

33. పుణ్యకర్మను పెంచి
    పాపకర్మను త్రుంచి
   నిర్మలత్వము పొందు మనసా
        సాధనంబున కలుగు
       హృదయ శుద్దిచె నీకు
     జ్ఞానంబు చేకూరు మనసా

34. సంసారబాధతో
     తల్లడిల్లుచు నుండి
    తాప మొందగనేల మనసా
      బాధ లెవ్వియు లేని
     ఆత్మయే నీవని
    అనుభూతి బడయుమూ మనసా

35. ఇలలోన విద్యలు
     ఎన్నియో యున్నను
    దుఃఖాన్ని బాపవూ మనసా
      దుఃఖమును పోగొట్టు
      ఏకైక సాధనము
    పరమార్థ విద్యయే మనసా 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు