Pages

తెలుగు వ్యాకరణము - మొదటి ప్రకరణము - భాష

తెలుగు వ్యాకరణము - మొదటి ప్రకరణము - భాష 
భాష అనగా నేమి?
ఒకరి అభిప్రాయమును ఇంకొకరు తెలుసుకొనుటకై జనులు ఏర్పరుచుకున్న గుర్తులను "భాష" అందురు.
ఉదా: తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళం, కన్నడం మొదలైన భాషలు 
నాగరిక - అనాగరిక భాషలు అనగా నేమి?
లిఖిత రూపము కలిగి, సాహిత్యము కూడా కలిగి యున్న భాషలను "నాగరిక భాషలు" అందురు.
కేవలము భాషిత రూపమునే కలిగి యున్న భాషలను "అనాగరిక భాషలు" అని అందురు. 
మన భాషకు తెలుఁగు - తెనుఁగు ఆంధ్రము అను పేర్లు ఎట్లు వచ్చినవి?
శ్రీశైలము, కాళేశ్వరం, దాక్షారామము అను 3 శివక్షేత్రములను కలిగియున్న రాష్ట్రము అగుట వలన మన రాష్ట్రమునకు పూర్వము 'త్రిలింగదేశము' అను పేరు కలిగినది. ఈ 'త్రిలింగ' శబ్దము వికృతి పొంది 'తెలుఁగు' గా మారినదనీ, ఆ విధముగా ఈ రాష్ట్రమునకు తెలుగు దేశమని, ఇక్కడి ప్రజలు మాట్లాడు భాషకు తెలుఁగు భాషయని పేరు వచ్చినది.
తెలుగులో న - ల లు పరస్పరము మార్పు చెందుట సహజము. 
ఉదా : మునగ - ములగ, మునుగుట - ములుగుట. ఆ విధముగా 'ల' కారము స్థానములో 'న' కారము వచ్చుట వలన తెలుఁగు - తెనుఁగుగా మారినది. ఇది ఒక అభిప్రాయము
మరియొక అభిప్రాయము ప్రకారము దక్షిణ దిక్కును సూచించు 'తెన్' అను పదము నుండి 'తెనుఁగు' శబ్దము ఏర్పడినది. న - ల లు పరస్పరము మార్పు చెందుట వలన 'తెనుఁగు' నుండి 'తెలుఁగు'  ఏర్పడినది.
ఉత్తరదిశ నుండి వచ్చిన ఆంధ్ర రాజులు పరిపాలించుట వలన మన రాష్ట్రమునకు 'ఆంధ్ర దేశమని'', మన భాషకు 'ఆంధ్రమని' పేర్లు వచ్చినవి.
ఈ విధముగా మన భాష తెలుఁగు - తెనుఁగు - ఆంధ్రము అను 3 పేర్లతో వ్యవహరింపబడుచున్నది. 
వ్యావహారిక భాష అనగా నేమి?
ప్రజల దైనందిన వ్యవహారంలో నున్న భాషను "వ్యావహారిక భాష"  అంటారు. 
గ్రాంథిక భాష అనగా నేమి?
ప్రాచీన గ్రంథముల యందలి భాషను "గ్రాంధిక భాష" అందురు. ఇది ప్రాచీన గ్రంథాలలోని సూత్రాలకు అనుగుణముగా ఉండును. 
సరళ గ్రాంథిక భాష అనగా నేమి?ప్రాచీన గ్రంథాలలో నున్న ప్రాచీన గ్రాంథిక భాష ను నేటి పరిస్థితులకనుగుణముగా సరళీకరించగా ఏర్పడిన భాషను "సరళ గ్రాంథిక భాష" అంటారు. 
శిష్ట వ్యావహారిక భాష అనగా నేమి?
శిష్టులు అనగా చదువు కొన్నవారి(పండితుల) వ్యవహారంలో నున్న భాషను "శిష్ట వ్యావహారిక భాష" అంటారు. నేడు గ్రంథాలలో, వార్తాపత్రికలలో, రేడియో టెలివిజనులలో, ఈ భాష విరివిగా వాడబడుచున్నది. దీనినే "ఆధునిక ప్రామాణిక భాష" అని కూడా అంటారు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు